మాటల యుద్ధంలో మరో అంకం

4 Mar, 2022 04:24 IST|Sakshi

మంత్రి హత్యకు ‘సుపారీ’పై తాజాగా టీఆర్‌ఎస్, బీజేపీ సవాళ్లు 

బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ 

సీబీఐ లేదా రిటైర్డ్‌ జడ్జితో విచారణకు బీజేపీ సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు విపక్ష జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ నడుమ సాగుతున్న రాజకీయ పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్, పట్టు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ నడుమ వివిధ అంశాలపై సాగుతున్న మాటల యుద్ధంలో.. తాజా గా రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు సంబంధించిన ‘సుపారీ’అంశం చేరింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వేడిని ఇది మరింత రాజేసింది.
 
టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ 
మంత్రిపై హత్యాయత్నానికి సంబంధించిన అంశంపై సీబీఐ లేదా రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు బీజేపీ డిమాండ్‌ చేస్తుంటే.. నిందితులకు షెల్టర్‌ ఇచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. పోలీసులు కాకుండా రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా తలపడాలని, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తప్పిదాలను ఎత్తిచూపుతున్న వారికి మద్దతు ఇస్తే తప్పేంటి అని డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారి ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

కాగా తమపై చేసే ఎలాంటి కుట్రలనైనా ఛేదిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కేసులో నిందితులకు బీజేపీ నేతలు ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. మంత్రి హత్యకు కుట్ర పన్నిన పాత్రధారులకు ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలంటూ ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే బీజేపీ సుపారీ హత్యా రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఆరోపించారు. 

మరిన్ని వార్తలు