ఈటల మాట ఎత్తకుండానే టీఆర్‌ఎస్‌ ప్రెస్‌మీట్‌

1 May, 2021 17:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రమంతా మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. తాజాగా ఈటల మంత్రిత్వ శాఖను ప్రభుత్వం లాగేసుకోంది. దీనిపై విస్తృత చర్చ నడుస్తున్న సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఈటల వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. ఈటల పేరు ఎత్తకుండానే సమావేశం ముగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ ఏవో వ్యాఖ్యలు చేశారని వాటికి కౌంటర్‌ ఇచ్చేందుకు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు.. ‘బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. కొన్నింటికి హద్దూఅదుపులు ఉంటాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్రం ఏం చేస్తుందో బండి సంజయ్ చెప్పాలి. కేంద్రం చేస్తున్న పనులను ప్రపంచ మీడియా ఏం చేస్తుందో సంజయ్ చూడాలి. బండి సంజయ్ చిల్లరగా, చీప్‌గా మాట్లాడటం ఎందుకు..? గతేడాది ప్రధాని చెప్పిన పనులు అన్ని చేశాం. బండి సంజయ్ బాధ్యతగా మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు సంజయ్. ఈటల విషయం సీఎం పరిధిలో ఉంది’.

అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని తెలిపారు. మీడియా వ్యక్తులపైన కూడా విరుచుకుపడ్డారని చెప్పారు. ఏది పడితే అది మాట్లాడటం సంజయ్‌కి తగదని హితవు పలికారు. కోవిడ్‌పైన రోజు సీఎం సమీక్ష చేస్తుంన్నాడని తెలిపారు. బండి సంజయ్‌ది నోరా? మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ సీఎం కేసీఆర్‌ సీఎస్‌తో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బట్టేబజ్ మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్‌కి కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. వాక్సిన్, రిమిడిసివర్ ఇంజెక్షన్‌లపై కేంద్రంపై మాట్లాడవెందుకు అని సంజయ్‌ని ప్రశ్నించారు.

కరోనా విషయంలో ప్రజల్లో తిరుగుతుంది మా టీఆర్ఎస్ నేతలు అని.. మీరు తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు. ఈ విధంగా విలేకరుల సమావేశం మమ అని ముగించారు. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నా ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయారు. విలేకరులు ఈటల విషయమై ప్రశ్నలు వేస్తుండగా అది తర్వాత వ్యవహారం అని చెబుతూ వెళ్లిపోయారు.

చదవండి: ఆక్సిజన్‌ అందక కర్నూలులో ఐదుగురు మృతి
చదవండి: కరోనాను మరిపించేందుకే ఈటల భూకబ్జా డ్రామాలు

మరిన్ని వార్తలు