కేసీఆర్‌ను జైల్లో పెట్టే ధైర్యం ఉందా?

4 Jan, 2021 17:48 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : బీజేపీ నేతల తీరుపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు స్థాయికి మించి మాట్లాడి తమ సహనాన్ని పరిక్షించొదన్నారు. వైఖరి మార్చుకోకుంటే టీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రామాగ్రామాల్లో అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెట్టే ధైర్యం ఉందా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్నందుకు జైల్లో పెడుతారా అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, 2016 రూపాయల పెన్షన్‌, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పిల్లలకు సన్నబియ్యంతో పోషకాహార భోజనం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు జైల్లో పెడుతారా అని నిప్పులు చెరిగారు. చదవండి: కేటీఆర్‌ సమర్థుడైతే.. కేసీఆర్‌ అసమర్థుడా?

‘బిచ్చగాళ్ల లాగా నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని రైతులను మోసం చేసిన బీజీపీ నేతలు రైతు పక్షపాతి కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతారా.. మీ పార్టీని రైతులు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 2 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దమ్ముంటే చూపించండి. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పెన్షన్ 600 రూపాయలు ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా. రైతుల కోసం మీరు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో చేయరు. చేస్తున్న కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తారా. చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలి. మీకు కావాల్సింది రాష్ట్రాభివృద్ధి కాదు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడమే’  అని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు