కమల్, దినకరన్, సీమాన్, కుష్బుకు తప్పని ఓటమి

3 May, 2021 03:49 IST|Sakshi

చతికిలపడ్డ తారలు.. మంత్రులు

12 మంది మంత్రుల పరాజయం

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు, సినీ తారలు చతికిలబడ్డారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఓటమి తప్పలేదు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కల్గిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇరు కూటముల్లో ముఖ్య నేతలు, సినీతారలు సైతం పలువురు ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నాడీఎంకే తరపున పోటీ చేసిన వారిలో మంత్రులు 12 మంది ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి. పాండియరాజన్, ఎంసీ సంపత్, సీవీ షణ్ముగం, జయకుమార్, కేటి రాజేంద్ర బాలాజీ, బెంజమిన్, ఎంఆర్‌ విజయభాస్కర్, కామరాజ్, ఓఎస్‌ మణియన్, రాజలక్ష్మి, వెల్లమండి నటరాజన్, వి.సరోజలు పరాజయం చవిచూశారు. ఈ కూటమి తరపున బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలకు కూడా ఓటమి తప్పలేదు. కర్ణాటకలో ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసి స్వస్థలం కరూర్‌ జిల్లా అరవకురిచ్చి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నామలై ఓడిపోయారు.  

దినకరన్, కమల్, సీమాన్‌లకు తప్పని ఓటమి 
అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఓటమి తప్పలేదు. కోవిల్‌ పట్టి నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. మూడో కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌ సతీమణి ప్రేమలత విజయకాంత్‌ విరుదాచలం నుంచి పరాజయం పాలయ్యారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న నామ్‌ తమిళర్‌ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్‌ తిరువొత్తియూరు నుంచి  ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీ చేసిన మక్కల్‌ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమలహాసన్‌ సాయంత్రం వరకు కాస్త మెజారిటీతో ముందుకు సాగారు. ఆ తదుపరి రౌండ్లలో మెజారిటీ తగ్గడంతో ఆయనకు పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నటి కుష్బు చెన్నై థౌజండ్‌ లైట్స్‌ నుంచి పోటీ చేశారు. గతంలో డీఎంకే, కాంగ్రెస్‌లలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని దృష్ట్యా, ఈసారి బీజేపీలో చేరిన ఆమె అతికష్టం మీద సీటు దక్కించుకున్నారు. గెలుపు లక్ష్యంగా థౌజండ్‌ లైట్స్‌లో శ్రమించినా ఫలితం దక్కలేదు.  

మరిన్ని వార్తలు