సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలకు కౌంటర్​.. రుణపడి ఉండాలన్న కేంద్రం

15 Feb, 2022 21:09 IST|Sakshi

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్రం బలవంతం చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు మంగళవారం 'అపోహలు-వాస్తవాలు' పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఏ రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని కేంద్రం స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలను ఒత్తిడి చేయడంలేదని వివరించింది. ఓపెన్ బిడ్ ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. విద్యుత్ మీటర్లు, విద్యుత్ కొనుగోళ్ల అంశం రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

పునరుత్పాదక విద్యుత్ కొనాలని తాము ఎక్కడా చెప్పలేదని, కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. అసలు, ఫలానా వారి నుంచే విద్యుత్ కొనాలని చెప్పలేదని, ఏ రాష్ట్రం ఎవరినుంచైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రం విమర్శించింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రూ.55 వేల కోట్లు అప్పుగా ఇచ్చాయని, కేసీఆర్ అందుకు రుణపడి ఉండాలని హితవు పలికింది.

ఇది చదవండి: కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా, చర్చకు సిద్ధం! కానీ..

మరిన్ని వార్తలు