‘ఈటల’ చేసిందేమీ లేదు

13 Sep, 2021 06:54 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ చేసిందేమీ లేకనే హుజూరాబాద్‌లో బొట్టు బిల్లలు, గోడ గడియారాలు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంచుతూ ఓట్లు అడుగుతున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పట్టణంలోని జమ్మికుంట రోడ్‌లో ఆదివారం మున్నూరుకాపు భవనానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.

ఇక్కడ దాదాపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, గతంలో వచ్చినదానికంటే ఈ సారి 50 వేల మెజార్టీతో గెలుస్తామన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటేయ్యాలన్నారు. గతంలో గ్యాస్‌ సిలిండర్‌కు రూ.250 ఉన్న సబ్సిడీలో రూ.40 తగ్గించారని, సిలిండర్‌ ధర మాత్రం రూ.410 నుంచి రూ.1000 చేశారన్నారు. తొందరలోనే సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం అందిస్తామని పేర్కొన్నారు. కాగా, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానపత్రాన్ని మున్నూరు కాపు సంఘం నాయకులు మంత్రికి అందజేశారు. 

ఈటల ఏ పనీ చేయలేదు : మంత్రి గంగుల
ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఏ పనీ చేయలేదని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. రాష్ట్రానికి అన్నం పెట్టే మున్నూరుకాపుల సంఘ భవనం గురించి మంత్రి హరీశ్‌రావుకు చెప్పగానే ఎకరం భూమి కేటాయించారన్నారు. భూమి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మనమందరం రుణపడి ఉండాలన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని కోరారు. 

ఆధునిక దోబీ ఘాట్లు నిర్మించి ఇస్తాం
టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే హుజూరాబాద్‌ ప్రజలకు భ విష్యత్తు అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన రజక ఆత్మీయ స మ్మేళనంలో మాట్లాడారు. త్వరలోనే ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు, ఆధునిక దోబీ ఘాట్‌లను ని ర్మించి ఇస్తామని తెలిపారు. రజక సంఘ భవనం కో సం ఎకరం భూమితో పాటు రూ.కోటి నిధులు కేటా యిస్తున్నామని, ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించి, రజక భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తామని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాల కల్పన.. 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మైనార్టీ కళాశాలల ఔట్‌ సోర్సింగ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపగా వారినుద్దేశించి మాట్లాడారు. రేపటి తరా లకు మంచి విద్యను అందించేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గెల్లు శ్రీని వాస్‌యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్మన్‌ కొలిపాక నిర్మల, పట్టణ అద్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్‌రెడ్డి, అపరాజ ముత్యంరాజు, తోట రాజేంద్రప్రసాద్, కల్లెపల్లి రమాదేవి, ప్రతాప మంజుల పాల్గొన్నారు.  

చదవండి: TS: 50 వేల మెజార్టీతో గెల్లు గెలుపు ఖాయం

మరిన్ని వార్తలు