Telangana: మిషన్‌–90 లక్ష్యంగా సాగండి

17 Dec, 2022 08:45 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టండి

బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలి

ధైర్యంగా ముందుకు వెళ్లి రాష్ట్రంలో అధికారం సాధించండి

బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆరునెలల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ మరింత పకడ్బందీగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ నాయకులు స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున తగిన వ్యూహాలతో కచ్చితంగా గెలుపొందేలా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వివిధవర్గాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలో ఇతర విపక్ష పార్టీల తీరును ప్రజలకు వివరించి, బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన మోదీ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నందున ధైర్యంగా ముందుకెళ్లి ఇక్కడ అధికారాన్ని సాధించాలని స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు 

కొత్తగా అసెంబ్లీ పాలక్‌లు..
రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలస్థాయిలో కోర్‌ కమిటీలను కూడా కుదించి ‘అసెంబ్లీ పాలక్‌’ల వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర చోట్ల మూడురోజులపాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీ ఇన్‌చార్జి, అసెంబ్లీ పాలక్‌లు, అసెంబ్లీ కన్వీనర్‌లు, అసెంబ్లీ విస్తారక్‌లతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఒక నేతతో కలిపి మొత్తం ఐదుగురితో నియోజకవర్గాల వారీగా పరిమిత కోర్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 30న కమిటీలతో జరిగే సమావేశానికి జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వెంటనే అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ కమిటీలు, జనవరి చివరికల్లా మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. 

ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణకు బీఎల్‌ సంతోష్‌?
ఈ నెల 28, 29 తేదీల్లో ఘట్‌కేసర్‌ వద్ద దక్షిణాది రాష్ట్రాల బీజేపీ పార్లమెంట్‌ విస్తారక్‌ (ఫుల్‌ టైమర్‌)ల శిక్షణ తరగతులకు బీఎల్‌ సంతోష్‌ హాజర య్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  2024 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ నియోజక వర్గాలపై బీజేపీ హైకమాండ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 

27న కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ధర్నా
రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, ధరణి పోర్టల్‌లో సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ప్రణాళిక రూపొందించారు.  వచ్చేనెల మొదటివారంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. జనవరి 7న నిర్వహించే సమ్మేళనంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా పాల్గొంటారని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ దూసుకెళ్తోంది: తరుణ్‌ చుగ్‌
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ దూసుకెళ్తోందని తరుణ్‌ చుగ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఏమీ చేయలేదని విమర్శించారు. హామీలను నెరవేర్చకపోవడంతో కేసీఆర్‌ను ప్రజలు ఇక వద్దనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పాలనతో విసుగుచెందిన ప్రజలు ఆయనను ఏమాత్రం గౌరవించని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కేసీఆర్‌ మదిలో తెలంగాణపై ద్వేషం ఉందని, అహంకారపూరిత వైఖరి కూడా ఆయన్ను నిండా ముంచిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పేరులో కూడా తెలంగాణ లేకుండా పోయిందన్నారు. 

మరిన్ని వార్తలు