Mithun Chakraborty: రాజ్యసభకు మిథున్‌ చక్రవర్తి.. బెంగాల్‌ కోసం బీజేపీ స్ట్రాటజీ!

5 Jul, 2022 16:19 IST|Sakshi

కోల్‌కతా: ప్రముఖ నటుడు, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ మిథున్‌ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. రూపా గంగూలీ స్థానంలో ఆయన్ని పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించేసినట్లు సమాచారం.

నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్‌ చక్రవర్తి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా పని చేశారు. అయితే ఆ తర్వాత నుంచి అనారోగ్యం రిత్యా ఆయన బెంగాల్‌ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా  పొలిటికల్‌ తెర మీదకు వచ్చిన ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలే.. చర్చనీయాంశంగా మారాయి. 

‘నా అనారోగ్య కారణాల వల్ల నేను చాలా కాలం ప్రజల ముందుకు రాలేకపోయాను. రాజకీయాలను రాజకీయాల్లాగే ఉంచాలి. కానీ, ఎన్నికల తర్వాత బెంగాల్‌లో అశాంతి నెలకొందన్న వార్త చాలా బాధించింది’ అంటూ పొలిటికల్‌ రీఎంట్రీ సంకేతాలను అందించారాయన. 

రాజ్యసభలో రూపా గంగూలీ, స్వపన్‌ దాస్‌గుప్తాల పదవి కాలం ముగియనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి  ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి. ఈ తరుణంలో ఖాళీ రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. బెంగాల్‌కు చెందిన ఈ రెండు ఖాళీలను బెంగాల్‌కు చెందిన వాళ్లతోనే భర్తీ చేయాలని ఇప్పటికే బీజేపీ కీలక ప్రకటన చేసింది కూడా. ఈ తరుణంలో.. 

ఢిల్లీ నుంచి సోమవారం అఘమేఘాల మీద కోల్‌కతా చేరుకున్న మిథున్‌ చక్రవర్తి.. పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుఖంత మజుందార్‌తో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో బెంగాల్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని మిథున్‌ చక్రవర్తికి ఆహ్వానం అందిందని, ఈ మేరకు ఆయన సైతం అందుకు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ కీలక వర్గాలు ప్రకటించాయి కూడా. 

లోక్‌సభ బరిలో ఛాన్స్‌!.. 
ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ బరిలోనూ మిథున్‌ చక్రవర్తిని దించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీదీ(మమతా బెనర్జీ) టీఎంసీకి చెక్‌ పెట్టేందుకు.. మిథున్‌ చక్రవర్తినే సరైన వ్యక్తిగా భావిస్తోంది ఆ పార్టీ. బాలీవుడ్‌, బెంగాలీ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మిథున్‌ చక్రవర్తి.. ఆ తర్వాతి రోజుల్లో రాజకీయాల్లోనూ రాణించారు. 2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో.. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ప్రణబ్‌ ముఖర్జీకి దక్కడంలో కీలక పాత్ర పోషించింది మిథున్‌ చక్రవర్తినే. టీఎంసీ తరపున గతంలోనూ(2014 నుంచి) ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు కూడా. అయితే 2016లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. కిందటి ఏడాది మార్చిలో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సమక్షంలో  మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరారు. 

>
మరిన్ని వార్తలు