డీఎంకేకి షాక్‌.. అమిత్‌ షా- అళగిరిల భేటీ?!

21 Nov, 2020 12:46 IST|Sakshi

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని కలిసిన కేపీ రామలింగం

చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట తన వ్యూహాలను సైలెంట్‌గా అమలు చేస్తోంది. ఈ క్రమంలో డీఎంకేకు చెక్‌ పెట్లేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా అళగిరి విశ్వాసపాత్రుడు కేపీ రామలింగం నేడు తమిళనాడు బీజేపీ చీఫ్‌ ఎల్‌ మురగన్‌ని కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన సందర్భవంగా చెన్నైలో ఆయనతో భేటీ అయ్యేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కొత్త పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్న అళగిరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలుపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇక ఏడాది విరామం తర్వాత రాష్ట్రానికి వస్తోన్న అమిత్‌ షా తమిళనాట పార్టీని బలోపేతం చేసే నిర్ణయాల గురించి క్యాడర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే పర్యటనలో భాగంగా అమిత్‌ షా, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో భేటీ అవుతారని తెలిసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌-మేలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారా లేదా అనే గందరగోళం తలెత్తిన నేపథ్యంలో రజనీ-అమిత్‌ షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. అలానే అమిత్‌ షా-అళగిరిల భేటీ కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్‌ ఎల్‌ మురగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్‌ షా రజనీకాంత్‌ని కలవరని నేను చెప్పలేను’ అంటూ పరోక్షంగా రజనీ-షాల మీటింగ్‌ గురించి హింట్‌ ఇచ్చారు. అంతేకాక ‘అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే దాని గురించి తమకు అధికారిక సమాచారం లేదని.. ఒకవేళ ఆయన బీజేపీలో చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని’ తెలిపారు. (డీఎంకేతో పొత్తు.. కమల్‌ క్లారిటీ)

కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం: అళగిరి
బీజేపీలో చేరబోతున్నారనే వార్తల్ని అళగిరి ఖండిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్‌ మురగన్‌ చేసిన వ్యాఖ్యలు విన్నాను. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నా మద్దతుదారులతో చర్చించిన తర్వాత నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. 2021 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించలేదు. అవన్ని పుకార్లు’ అంటూ కొట్టి పారేశారు. ‘పార్టీ వ్యతిరేక’ కార్యకలాపాల ఆరోపణలతో అళగిరిని 2016 లో డీఎంకే నుంచి బహిష్కరించారు. కరుణానిధి మరణం తరువాత స్టాలిన్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతరం అళగిరిపై వేటు వేశారు. 2018 లో కరుణానిధి మరణించిన వారం తరువాత, అళగిరి తన సోదరుడికి డీఎంకే కార్యకర్తలు తనతో ఉన్నారని బహిరంగంగా సవాలు చేశారు.
 

మరిన్ని వార్తలు