‘ఆ పార్టీ తమిళులకు వ్యతిరేకం’

25 Aug, 2020 16:16 IST|Sakshi

తమిళ సంస్కృతికి కాషాయ పార్టీ వ్యతిరేకం : స్టాలిన్‌ 

చెన్నై : జాతీయ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రజలను డీఎంకే రెచ్చగొడుతోందని, జాతి ప్రయోజనాల కోసం పనిచేయని వారికి ఆశ్రయం ఇస్తోందని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ దీటుగా బదులిచ్చారు. తమిళ సంస్కృతికి, జాతి ఐక్యతకు బీజేపీ శత్రువని స్టాలిన్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని, తమిళనాడులో పాలక ఏఐఏడీఎంకే సర్కార్‌ అండతో డీఎంకేను టార్గెట్‌ చేసిందని కాషాయపార్టీపై విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రజాస్వామిక పార్టీగా దేశ అభివృద్ధి, జాతి ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి, ప్రజల హక్కుల కోసం పనిచేస్తూ దేశ ప్రజాస్వామిక విలువలను కాపాడారని స్టాలిన్‌ గుర్తుచేశారు. బీజేపీ మాత్రం దేశాన్ని అప్రకటిత ఎమర్జెన్సీలోకి నెట్టివేసిందని, రాష్ట్రాల స్వాత్రంత్ర్యాన్ని లాగేసుకున్నారని, దేశ వైవిధ్యతకు ముప్పు ముంచుకొచ్చిందని స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : ఎవరి లెక్కలు వారివే!

రాజకీయ ప్రత్యర్ధులను దేశ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులుగా ముద్రవేసే ధోరణి పెరిగిపోయిందని అన్నారు. హిందీ మాట్లాడని డీఎంకే ఎంపీని మీరు భారతీయురాలేనా అని ప్రశ్నించిన ఉదంతంతో పాటు యోగ వెబినార్‌లో హిందీయేతర వక్తలను బయటకు వెళ్లమని కోరడం వంటి పలు ఉదంతాలను స్టాలిన్‌ ఓ ప్రకటనలో ప్రస్తావించారు. ఇక ఇటీవల తమిళనాడు బీజేపీ కార్యవర్గ సమావేశం (వీడియో కాన్ఫరెన్స్‌) ఉద్దేశించి బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా మాట్లాడుతూ  2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు గట్టి గుణపాఠం నేర్పాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. డీఎంకే నిత్యం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నడ్డా కార్యకర్తలను కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా