రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చంద్రబాబు తొత్తు

10 Jan, 2021 03:52 IST|Sakshi

ఎమ్మెల్యే అంబటి ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు తొత్తుగా మారిపోవడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా.. రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేయడం, వద్దన్నా నిర్వహించడం రాజ్యాంగ సంస్థ విధానమేనా అని ప్రశ్నించారు. ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందించి, 2 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటో ఆయన చెప్పాలన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..
గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన తర్వాత అకారణంగా ఇదే నిమ్మగడ్డ రమేశ్‌‡ ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్రంలో 30 కోవిడ్‌ కేసులు కూడా లేకపోయినా, ప్రభుత్వంతో ఏమాత్రం సంప్రదించకుండా తెల్లారేసరికి ఎన్నికలు వాయిదా వేశారని తెలిపారు. నిజానికి 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. తెలుగుదేశం ఓడిపోతుందనే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు ట్రయల్‌ రన్‌ జరుగుతోందని.. ఈ సమయంలో ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం సిద్ధంలేదని చెప్పినా నిమ్మగడ్డ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. (చదవండి: చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్‌)

ప్రజలపై కక్ష తీర్చుకోవడానికే..
తనను ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకోవడానికే చంద్రబాబు ఈ వ్యవహారం నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు.  నిమ్మగడ్డ కంటే పెద్ద స్థాయిలో ఉన్న చీఫ్‌ సెక్రటరీ, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వద్దంటున్నా, ఎన్నికలు పెడతానని నిమ్మగడ్డ చెప్పడం చూస్తుంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన కుట్రగా భావించాల్సి వస్తోందన్నారు.     

మరిన్ని వార్తలు