బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వార్‌.. వారి ఫోన్‌ సంభాషణ ఇలా

7 Mar, 2023 08:15 IST|Sakshi

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు వార్‌ కొనసాగుతోంది. . ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు ఒకే పార్టీలో ఉన్నా.. ఇరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

ఫ్లెక్సీల లొల్లి మొదలు ఎమ్మెల్యే, ఎంపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడం.. వారి ఫోన్‌ సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వారి ఫోన్‌ సంభాషణ ఇలా..

గువ్వల: నియోజకవర్గంలో నీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు.
పోతుగంటి: ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది బాలరాజ్‌.
గువ్వల: పార్టీలో ఉండదట్ల..
పోతుగంటి: అయితే పార్టీలో తేల్చుకుందాం..
గువ్వల: నాకున్న అధికారాన్ని నేను ఉపయోగిస్తా.
పోతుగంటి: నేను జిల్లా అధ్యక్షుడిగా పని చేశా. నాకు తెలుసు. నీకిచ్చే గౌరవం నీకిస్తా. నాకిచ్చే గౌరవం నాకుంటది. చేసేది చేసి అంతా అయిపోయింది అంటే ఎట్లా?
గువ్వల: అందులో సంబంధం ఉందంటే భవిష్యత్‌లో కూడా చేస్తా.
పోతుగంటి: చేసుకోవయ్యా.. నేనొద్దన్నానా ?
గువ్వల : వయా గియా అని మాట్లాడకు. మంచిగా మాట్లాడు. సర్‌ అని పిలుస్తుంటే వయా అంటవ్‌.. అటెండర్‌ మాట్లాడినట్లు మాట్లాడతవ్‌..
పోతుగంటి: వయా అంటే ఏంది అర్థం.. అయ్యా బాలరాజ్‌ గారు.. మీరు చేసేది చేసుకోండి. దాని గురించి ఎందుకంత కోపం..
గువ్వల: ఇక నుంచి నీ కొడుకు పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు. ఈ రోజు, రేపు తీసేయండి.
రాములు: అంటే.. అంటే.. నీ బెదిరింపులు నాకాడా పనికి రావు.
గువ్వల: రికార్డు చేసుకో.. ఎవరికైనా చెప్పుకో.. అట్లే చేస్తే నీ కొడుక్కి పార్టీ పరంగా మర్యాద ఉండదు.
పోతుగంటి: నా కొడుకు నాకు సహకారంగా ఉంటడు. ఎవరి కొడుకు వారు సహకారంగా ఉంటడు. మరి నీ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు?
గువ్వల: మా అభిమానులు కట్టారు.
పోతుగంటి: మాకూ అభిమానులే కట్టారు.
గువ్వల: ఇలా చేస్తే మంచిగుండదు.
పోతుగంటి: నీ బెదిరింపులు నా వద్ద చెల్లవు. ఈ విషయం అధిష్టానం వద్దే చూసుకుందాం.

మరిన్ని వార్తలు