ఇది పార్టీనా.... ప్రైవేట్‌ కంపెనీనా?

25 Sep, 2021 01:56 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ తీరుపై సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌ 

పార్టీలో ఏ ఒక్కరూ హీరో కాలేరంటూ వ్యాఖ్యలు 

రేవంత్‌ అభిమానులకు దీటుగా తన అభిమానులు స్పందించాలని పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ భేటీలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలపై జరిగిన చర్చలో జగ్గారెడ్డి చాలా ఆవేశంగా మాట్లాడారు. ఇది కాంగ్రెస్‌ పార్టీనా? ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీనా?.. అని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండానే గజ్వేల్‌ సభలో నిరుద్యోగ సమస్యపై రెండు నెలల కార్యాచరణను రేవంత్‌ ఎలా ప్రకటిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

తనకు కూడా సమాచారం లేకుండా సంగారెడ్డి జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు వెళ్లారని, జహీరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌కు వెళ్లి గీతారెడ్డికి సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తనకు కూడా సమాచారం ఇవ్వలేదంటే రేవంత్‌తో తనకు వివాదాలున్నాయని చెప్పాలనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యేను అయ్యానని అన్న జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌లో ఏ ఒక్కరూ హీరో కాలేరన్న విషయాన్ని గమనించాలని చెప్పారు.

అవమానపరుస్తున్నారు...
అనంతరం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేస్తుంటే అవమానాలపాలు చేస్తున్నారని, ఏదైనా మాట్లాడితే టీఆర్‌ఎస్‌ మనుషులని ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే ఉన్న అడ్డు ఎవరో చెప్పాలన్న జగ్గారెడ్డి.. గజ్వేల్‌ సభలో కనీసం తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. తనకూ రాష్ట్రంలో అభిమానులున్నారని, 2 లక్షల మందితో సభ పెట్టగలనని చెప్పారు. పార్టీలో మాట్లాడే అవకాశం లేదు కాబట్టే మీడియాతో మాట్లాడాల్సి వస్తోందని జగ్గారెడ్డి వెల్లడించారు.  

ధీటుగా స్పందించాలని పిలుపు.. 
అంతటితో ఆగని జగ్గారెడ్డి శుక్రవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో రేవంత్‌ అభిమానులు అసభ్య పదాలు వాడితే తన అభిమానులు కూడా దీటుగా స్పందించాలని ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి అభిమానులు ఎలాంటి కౌంటర్‌ ఇస్తే అలాంటి కౌంటర్‌ ఇవ్వాలని, తనను తిట్టిన వారి చిరునామాలు సేకరించాలని సూచించారు. తన పిలుపును ఈజీగా తీసుకోవద్దని జగ్గారెడ్డి పేర్కొనడాన్ని చూస్తే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో అమీతుమీ తేల్చుకునేందుకే ఆయన సిద్ధపడ్డారని అర్థమవుతోందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని వార్తలు