ఈ రోజు లాస్ట్ మీటింగ్‌.. గాంధీ భవన్‌లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా

3 Nov, 2021 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేశాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశమైంది. ఆ సమావేశంలో.. క్యాడర్‌ను కూడా కాపాడుకోలేని స్థితిలో పార్టీ ఉందంటూ పలువరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ సమక్షంలో భేటీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 వరకు పార్టీ వ్యవహారాలకు, కార్యాక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇవాళ్టి సమావేశంలో చివరి సారిగా తాను మాట్లాడతానని చెప్పారు.

చదవండి: (నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల)

'నాకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటు. వాస్తవాలు చెప్తే.. నాపై అబాండాలు వేస్తున్నారు. ఓ సెక్షన్‌ మీడియా నన్ను టార్గెట్‌ చేసింది. వాస్తవాలు చెప్తే నేరమన్నట్లుగా తప్పుపడుతున్నారు. ఒక్కోసారి మాట్లాడక పోవడమే మంచిదనిపిస్తుంది. ఈ రోజు లాస్ట్ మీటింగ్‌లో ఏదోటి తేల్చుకుంటా. గాంధీ భవన్‌లో మాట్లాడాలా వద్దా అనేది ఈ రోజు డిసైడ్ అవుద్ది. నేను మాట్లాడకపోతే పోయేదేంలేదు. నా సీటు నేను ఎలా గెలవాలా అని ఆలోచిస్తున్నా. ఇక నుంచి అంతర్గత వ్యవహారాలపై మాట్లాడను. షోకాజ్ నోటీసులు ఇస్తారా అనేది చూద్దాం. మాణిక్కం ఠాగూర్‌కు ఏం తెలియదు. మంచి చెప్తే వినకపోతే నాదేం పోతుంది. అన్ని విషయాలు లోపల మాట్లాడ్తా. నా బలహీనతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. హుజూరాబాద్‌కు స్టార్‌లు, సూపర్ స్టార్‌లు పోతేనే దిక్కు లేదు నేను పోతే ఓట్లు పడతాయా..?' అని జగ్గారెడ్డి అన్నారు. 

చదవండి: (Huzurabad Bypoll: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్‌’ ఫలితం) 

మరిన్ని వార్తలు