బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి

2 Jul, 2022 14:41 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

సాక్షి, ధర్మవరం (సత్యసాయి జిల్లా): ‘‘రాజకీయ నాయకుడంటే విలువలు ఉండాలి. కష్టమైనా.. నష్టమైనా కార్యకర్తలకు అండగా ఉండాలి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి. నీలా ఓడిపోయిన రెండు నెలలకే పార్టీ మారి కార్యకర్తలను గాలికి వదిలేయడం నాకు రాదు.  పెయిడ్‌ ఆర్టిస్టులకు డబ్బులిచ్చి కుటుంబ సభ్యులను తిట్టిస్తే ఇకపై సహించేది లేదు’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.  తాడిమర్రి మండలంలో ఆటోపై విద్యుత్‌ తీగ పడి చెలరేగిన మంటల్లో ఐదుగురు మృతి చెందగా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్నారు.  గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. 

ఫ్యాక్షన్‌ వద్దనుకునే... 
ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంచాలనే తన తల్లిదండ్రులు తనను విదేశాల్లో చదివించారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇష్టం లేకపోయినా 2006లో రాజకీయాల్లోకి వచ్చానని, అందువల్లే ఫ్యాక్షన్‌ వద్దనుకుని అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నానన్నారు. 

అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు ..
సంగాలలో పార్వతమ్మ అనే మహిళను కొట్టంలోకి వేసి సూరి నిప్పంటించాడనీ, రామలింగారెడ్డి అనే వ్యక్తిని జీపుకు కట్టేసి చంపాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. అక్కడి నుంచి అనంతపురం వెళ్లి అక్కడ పరిటాల రవితో సన్నిహితంగా ఉంటూ డబ్బులు సంపాదించాడన్నారు. అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం సూరి నైజమన్నారు. సూరి అనంతపురంలో భూకబ్జాలు చేయగా.. అప్పటి ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోయాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు తన మనుషులతో పోలీసులపైనే దాడి చేయించాడన్నారు. సూరి అధికారంలో ఉన్నప్పుడు అరాచకమే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.  

చదవండి: (ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌లో బీజేపీ టాప్‌)

ఇక సహించబోం.. 
జీతానికి, కులానికి ఒకరిని పెట్టుకుని నోటికి ఎంత పడితే అంత తిట్టిస్తే ఇక సహించబోమని కేతిరెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను తిడుతుంటే ఎవరైనా రెచ్చిపోతారన్నారు. కేతిరెడ్డిపై మాట్లాడితే క్రేజ్‌ వస్తుందని సూరి సోషల్‌ మీడియా వేదికగా తన అనుచరులతో బూతులు తిట్టిస్తున్నాడన్నారు. తాను 20, 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాననీ, సూరి టీడీపీ టికెట్‌ కోసం అడ్డదారులు తొక్కుతున్నాడన్నారు. సోషల్‌ మీడియా ద్వారా తప్పులు చూపించాలి గానీ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడితే సహించబోమన్నారు. 

నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. 
ఆర్‌అండ్‌బీ రోడ్డు కబ్జా చేశావు అంటున్నావే ఎక్కడో చూపించు అని కేతిరెడ్డి... ప్రశ్నించారు. వ్యాపారులు ఆర్‌అండ్‌బీ స్థలంలో సొంత ఖర్చుతో రోడ్డు వేసుకుంటుంటే నేను కబ్జా చేసినట్టా?  కరెంటు వైరు తెగి ప్రమాదం జరిగితే కాంట్రాక్టర్‌తో కమీషన్‌ తీసుకున్నాడని నీచంగా మాట్లాడుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి.. సోలార్‌ కంపెనీ నీకు భయపడి వెనక్కి పోలేదా? అని ప్రశ్నించారు.  కర్ణాటక బ్యాంకుల్లో లోన్లు ఎలా తెచ్చుకుంటున్నావో చెప్పాలా అని సూరిని కేతిరెడ్డి ప్రశ్నించారు. 151 ఎకరాలు భూకబ్జా చేశావని కలెక్టర్‌ నాగలక్ష్మి నిర్ధారించారన్నారు. చేనేతలకు డబ్బులు ఎగ్గొట్టిన కళానికేతన్‌ వాళ్లతో ఎంత డబ్బు వసూలు చేశావో అందరికీ తెలుసన్నారు.  

మరిన్ని వార్తలు