మాతృమూర్తి సేవ కోసం వెళితే విమర్శలా?

17 Aug, 2020 10:58 IST|Sakshi

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : కరోనా కమ్ముకున్న వేళ నా కుటుంబంపై కనికరం లేని కథనాలేలని, మాతృమూర్తి సేవ కోసం వెళ్లిన తనపై విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం తన జన్మహక్కు అని, దాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఎన్టీవీలో వచ్చిన కథనాలకు దీటుగా ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. తన మాతృమూర్తి రాచమల్లు మునిరత్నమ్మతోపాటు హైదరాబాదు కూకట్‌పల్లి హోలిస్టిక్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆదివారం ఫోన్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా దాన్ని అదుపులో ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ కరోనా ఆవహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మా నుంచి ఎవరికీ వ్యాధి సోకకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.ఎన్‌టీవీలో కక్షపూరిత, దురుద్దేశంతో కూడిన   కథనం ప్రచారం చేశారని తెలిపారు. ‘ఒక్కసారిగా సైలంట్‌ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే’అని విషప్రచారం చేసిందన్నారు.

ఈనెల 12న వైఎస్సార్‌ చేయూత కార్యక్రమానికి హాజరు కాబోయే ముందు రోజే తాను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యే హోదాలో కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఈనెల 14న మా తల్లి రాచమల్లు మునిరత్నమ్మకు పాజిటివ్‌ రావడంతో ఆమె చికిత్స కోసం హైదరాబాద్‌కు బయల్దేరాను.అంతకుముందే తాను మరో సారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నానన్నారు. ప్రొద్దుటూరు–హైదరాబాద్‌ మార్గమధ్యలో ఉండగా తనకు కరోనా పాజిటివ్‌ అని తెలిసిందన్నారు. తాను, తన తల్లి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరామన్నారు.  

ఎన్టీవీ తనపై కక్షకట్టి ఉద్దేశపూర్వకంగానే ఎక్కడో ఆరుబయట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. మానవత్వం  ఉన్న తన నియోజకవర్గ ప్రజలు, ఆఖరికి ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఎన్టీవీ వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మారి, జర్నలిజం విలువలు మరిచిపోయి అసత్యప్రచారం చేస్తోందన్నారు. గౌరప్రదంగా, నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలను అందించడం,జెండా వందనం చేయడం తన విధి అన్నారు. దీనిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదన్నారు.  కరోనా వ్యాధిగ్రస్తుల మధ్య స్వాతంత్య్ర వేడుకులను నిర్వహించడం తప్పు ఎలా అవుతుందో ఎన్టీవీనే చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు