నేను రెడీ.. మీరూ సిద్ధమేనా? 

20 Dec, 2022 04:05 IST|Sakshi

కేసీఆర్, కేటీఆర్‌ ఆస్తులు ప్రకటిస్తారా? 

ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్న  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఆస్తులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటిస్తారా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు సూటిగా ప్రశ్నించారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలన్నీ ప్రకటిస్తారా ? అని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనది అక్రమ సంపాదన అంటూ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

అక్రమంగా సంపాదించి ఉంటే గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. గతంలో పటాన్‌చెరు పరిశ్రమల్లో తాను డబ్బు వసూలు చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇన్నాళ్లూ దానిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన తప్పుడు సమాచారంపై రోహిత్‌రెడ్డి సమాధానం చెప్పాలనీ, అసలు ఆయన డ్రగ్స్‌ తీసుకున్నారా? లేదా ?

బెంగళూరు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా.. అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. వీటన్నింటిపై రోహిత్‌రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద మాట్లాడితే బాగుండేది. అయ్య ప్పమాలలో ఉండి.. అసభ్యంగా మాట్లాడారు. అయ్యప్పమాల తీశాక అన్నింటికీ సమాధానం చెబుతాను’ అని రఘునందన్‌ వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే రోహిత్‌రెడ్డి భయపడుతున్నారనీ ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్‌రావు నిందించారు. 

మరిన్ని వార్తలు