వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

6 Aug, 2023 12:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది.

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు.

ధూల్‌పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్‌ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్‌పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. గుడుంబా నిషేధం  తర్వాత ధూల్‌పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్‌పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

కాగా మ‌హ్మద్ ప్రవ‌క్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ స‌స్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంటున్నట్లు హైకమాండ్‌ తెలిపింది. శాస‌న స‌భాప‌క్ష ప‌ద‌వినుంచి కూడా తొల‌గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు.
చదవండి: సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్‌.. బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు