బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్‌

8 Jan, 2023 02:00 IST|Sakshi

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి బీ టీమ్‌లా తయారైందని, ఇప్పటికే కోర్టులో నడుస్తున్న కేసు వివరాలతోనే మరోమారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎల్‌బీనగర్‌ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాగంలోని షెడ్యూలు 10 నిబంధనలకు లోబడే తాము గతంలో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని విలీనం చేశామని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాల యం తెలంగాణభవన్‌లో సుధీర్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి తమపై ఫిర్యాదు చేశారని, గోవాలో కాంగ్రెస్‌ పార్టీ శాసనభాపక్షం బీజేపీలో విలీనం కావడం ఆయనకు తప్పుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజస్తాన్‌లో బీఎస్‌పీ ఎమ్మెల్యేలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అంశంపై రేవంత్‌రెడ్డి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు.

గతంలో ఎన్నడూ లేనంతరీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడగా, బీజేపీని బలోపేతం చేసేందుకు రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. గతంలో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చిందెవరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే కాంగ్రెస్‌ ఆనవాయితీని బీజేపీ కూడా కొనసాగిస్తోందన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరినట్లు సుధీర్‌రెడ్డి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు