ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. హైకోర్టులో రోహిత్‌ రెడ్డి పిటిషన్‌..

27 Dec, 2022 13:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈడీ విచారణకు గైర్హాజరుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తన పిటిషన్‌ విచారణకు రానున్నట్లు తెలిపారు. ఈడీకి సంబంధంలేని కేసులో విచారణ సరికాదని తెలిపారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సీబీఐ  విచారణ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్తానని తెలిపారు.

కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో  కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే  ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిరి రెండు సార్లు విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు ఇచ్చింది. నందకుమార్‌ నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని రోహిత్‌ను ఆదేశించింది.

అయితే ఈడీ ఎదుట హాజరు కాకుడదని రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈడీ అధికారులకు మెయిల్‌ చేశారు. హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో..  తాను విచారణకు హాజరు కాలేనని రోహిత్  పేర్కొన్నారు. మరోవైపు  బుధవారం హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండగా.. హై కోర్టు తీర్పు ఒచ్చాకే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు రోహిత్‌ రెడ్డి మెయిల్‌కు ఈడీ అనుమతి ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్‌ ఆనంద్‌

మరిన్ని వార్తలు