ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీలో ఈటల ‘స్వతంత్రం’.. చివరి నిమిషంలో ఆదిలాబాద్‌లో షాక్‌!

27 Nov, 2021 09:37 IST|Sakshi

బలం లేనందున ‘స్థానిక’ సమరానికి దూరంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం

అయినా కరీంనగర్, ఆదిలాబాద్‌లో ఇండిపెండెంట్లను నిలిపిన ఈటల

చివరి నిమిషంలో ఈటలకు షాక్‌.. పోటీ నుంచి తప్పుకున్న ఓ స్వతంత్ర అభ్యర్థి  

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికలు బీజేపీలో వేడి రాజేస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో అభ్యర్థులను గెలిపించుకునే బలం లేనందున పోటీకి దూరంగా ఉండా లని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించగా ఆ పార్టీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీలో నిలిచి ఏకగ్రీవాలు కాకుండా చూడాల్సిందని అభిప్రాయపడ్డారు.

శుక్రవారం పార్టీ పదాధికారుల సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అక్కడ గెలవబోతున్నారన్నారు. ఆదిలాబాద్‌లోనూ తానే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలిపినట్లు తెలిపారు. ఈ రెండు చోట్లా తాను అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఈటల వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈటల పోటీకి దింపిన స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. 

రఘునందన్‌రావు సైతం... 
మెదక్‌ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా ఓ ఇండిపెండెంట్‌ను బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరించారా అనే అంశం చర్చనీయాంశం అవుతోంది. ముందుగా చెప్పి ఉంటే తాము కూడా జిల్లాల్లో అభ్యర్థులను బరిలో దింపేవారమని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీకి దూరంగా ఉండాలన్న అధిష్టానం నిర్ణయంతో తాము వెనక్కు తగ్గామంటున్నారు. ఈ విషయం రాష్ట్ర నాయకత్వం వద్ద తేల్చుకుంటామని చెబుతున్నారు.  
(చదవండి: వచ్చే ఏడాది సెలవులివే.. ఆ నెలలోనే అధిక సెలవులు )

బీజేపీ ‘ఆకర్ష్‌ మంత్రం.. పార్టీలో చేరికలపై పదాధికారుల చర్చ 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ‘ఆకర్‌‡్ష’రాజకీయాలకు బీజేపీ పదును పెడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర, ధాన్యం కొనాలంటూ పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాలు, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలుపుతో.. ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని బీజేపీ అంచనా వేస్తోంది. రాజకీయంగానూ మరింత బలోపేతమైనట్టుగా నాయకత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీలో వివిధ పార్టీలకు చెందిన వేర్వేరు స్థాయి నాయకుల చేరికలపై శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర పదాధికారుల భేటీలో చర్చించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో పాటు, నియోజకవర్గాల్లో పట్టున్నవారిని, మంచి ఇమేజీ ఉన్న వారిని, బీజేపీ అభివృద్ధికి దోహదపడే వారిని చేర్చుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. గతేడాది కాలంలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సాగించిన పోరాటా లపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది.

రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే మరింత ఉధృతమైన పోరాటాలకు కార్యాచరణ రూపొం దించి అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. బండి సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, విజయశాంతి, రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకరరెడ్డి పాల్గొన్నారు.   
(చదవండి: విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి..)

మరిన్ని వార్తలు