‘పెట్రోల్ బంకుల్లో మోదీ ఫోటోలకు దండం పెడుతున్నారు’

9 Mar, 2021 15:00 IST|Sakshi

తెలంగాణ వచ్చాక 600 నూతన గురుకుల పాఠశాలల ఏర్పాటు

12,800 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తున్నాం

8 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ ష్కాలర్ షిప్‌లు

మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఉండవని, తెలంగాణ వస్తే ఆంధ్ర, తెలంగాణకు మధ్య గొడవలు జరుగుతాయన్నారని తెలిపారు. అసలు పరిపాలన చేయగలరా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇంకా సెటిల్ అవలేదని కిరణ్‌ కుమార్‌రెడ్డి చెప్పిన మాటలను ప్రస్తావించారు. తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ మంగళవారం మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు తీవ్ర విద్యుత్ కొరత ఉండేదని, తెలంగాణ వచ్చాక ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. తాను చదువుకునే రోజుల్లో ఎండాకాలం మహిళలు బిందెలతో ధర్నాలు చేసేవారని, ప్రస్తుతం తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు. ఇంకా ఆయన మాటల్లోనే...

‘శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించాం. ఈ ఆరేళ్లలో ప్రజల మౌలిక సదుపాయాలు కోసం పనిచేశాం. తెలంగాణ వచ్చాక 600 నూతన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 20 వేలు ఖర్చు పెడుతోంది. 18 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ ష్కాలర్ షిప్‌లు ఇస్తున్నాం. 12,800 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తున్నాం. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి అంబేద్కర్, పూలే, వివేకానంద ష్కాలర్ షిప్‌ల పేరిట 20 లక్షలు ఇస్తున్నాం. విద్యారంగంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి మనుమడు, మనుమరాలు ఏ బియ్యంతో భోజనం చేస్తారో అదే భోజనాన్ని హాస్టళ్లలోని విద్యార్థులకు అందిస్తున్నాం. లక్షా 80వేల కోట్లు బడ్జెట్ పెట్టుకుని సిద్ధమవగానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల ప్రభుత్వానికి లక్షా 52వేల కోట్ల నష్టం వాటిల్లింది. 10 లక్షలమంది ప్రయివేట్ టీచర్లున్నారు.. వీరందరికీ సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మీ గొంతులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రయివేట్ టీచర్లను ఆడుకోలేదు. 

చదవండి: ‘బీజేపీ వాళ్ల​కు తెలివి లేదు మన్నులేదు.. తిట్టుడే తిట్టుడు’

దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. కేసీఆర్ నా తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగణ చేస్తున్నారు. హైదరాద్‌లో 5లక్షల సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశాం. గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి ఎమ్ఎన్‌సీ కంపెనీలు వచ్చాయి. బలమైన న్యాయకత్వం, భద్రత వల్ల పెట్టుబడులు వస్తున్నాయి. లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం. దీనిపై ఇటీవలే శ్వేత పత్రం ఇచ్చాం. 2013లో అప్పటి గుజరాత్ సీఎం మోదీ ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి మీది చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. పెట్రోల్ లీటర్ రూ.100కి చేరింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు.

చదవండి: సర్వే: షీ టీమ్‌ల పనితీరుపై 89 శాతం సంతృప్తి

పెట్రోల్ బంకుల్లో మోదీ ఫోటోలకు దండం పెడుతున్నారు. హైదరాబాద్‌కు ఒక్క ఐఐఎం కూడా మంజూరు చేయలేదు. ఎన్ఐటీ, ఎయిమ్స్, ఐసార్, నవోదయ, మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా తెలంగణకు ఇవ్వలేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తెలంగాణలో లేదు. లక్ష కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్తారు. తెలంగాణ నుంచి 2లక్షల కోట్లు ట్యాక్స్ కడితే లక్ష కోట్లు కూడా రాలేదు. తెలంగాణ రూపాయి కడితే ఆటానా కూడా రావట్లేదు. బీజేపీ తరపున పోటీ చేసే న్యాయవాది అన్యాయంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించే గొంతు కావాలంటున్న బీజేపీ నేతలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ప్రశ్నించరు. అందరూ ఓటింగ్‌లో పాల్గొనండి. వాణి దేవిని గెలిపించండి.’ అని కోరారు. 

చదవండి: వుమెన్స్‌ డే: ఆమె కానిస్టేబుల్‌ కాదు.. హోం మంత్రి! 

మరిన్ని వార్తలు