ఏసీడీ పేరిట కేసీఆర్‌ పన్ను 

1 Feb, 2023 01:58 IST|Sakshi
ధర్నాలో రైతులు, కాంగ్రెస్‌ నాయకులు  

సీఎండీ ప్రభాకర్‌రావు పదవి నుంచి వైదొలగాలి  

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం... జిల్లా కేంద్రంలో ధర్నా 

జగిత్యాలటౌన్‌: విద్యుత్‌ సంస్థలోని నష్టాలు పూడ్చుకునేందుకే వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) చార్జీలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. సంస్థను నిర్వహించడంలో విఫలమైన సీఎండీ ప్రభాకర్‌రావు తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ఏసీడీ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న కేసీఆర్‌ పన్నును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయానికి నిర్దిష్ట విద్యుత్‌ సరఫరా వేళలు ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతిభవన్‌ ఎదుట మంగళవారం ధర్నా చేశారు.

తొలుత ఇందిరాభవన్‌ నుంచి రైతులు, కాంగ్రెస్‌ శ్రేణులతో విద్యుత్‌ ప్రగతిభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలున్నాయని, సీఎం కేసీఆర్‌ ఇలాఖాలో ఏసీడీ చార్జీలు లేవని, కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించే ఉత్తర తెలంగాణ ప్రజలపైనే భారం ఎందుకని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మించిన ప్రభుత్వం..ప్రజలపై రూ.40వేల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనను అంతమొందించేందుకు జగిత్యాల నుంచి ఉద్యమం మొదలుపెడతామని ఆయన హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు