‘బండి సంజయ్‌’ ఓ మూర్ఖుడు

11 Jan, 2022 12:52 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

సాక్షి, హన్మకొండ: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ మూర్ఖుడు. సీఎం కేసీఆర్‌పై వాడుతున్న భాష అభ్యంతరకరం’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌తో కలిసి కడియం శ్రీహరి మాట్లాడారు.

బండి సంజయ్‌కి చదువురాదు. ఒక సీఎం అయి ఉండి మరో సీఎంపై ఎలా మాట్లాడాలో తెలియదా అని మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్, అస్సాం సీఎం హిమంత్‌ బిశ్వ శర్మను ఆయన ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే కిషన్‌రెడ్డి పారిపోయారని, ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్‌ దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే అవకాశముందని, ఈ క్రమంలో కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు.

317 జీఓ పై వరంగల్‌లో బీజేపీ నిరసన సభ పెడితే ఏ ఒక్క ఉద్యోగ సంఘమైనా, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. మేడారంకు జాతీయ హోదా తీసుకువచ్చారా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో మేడారం జాతరకు రూ.332 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రత్యేక నిధులు తేవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. బీజేపీ దేశ వ్యాప్తంగా ఉనికిని కోల్పోతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై బీజేపీ నాయకులు అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు