Delhi Liquor Policy Case: ఢిల్లీ వెళ్లేముందు కేసీఆర్‌తో మాట్లాడిన కవిత.. ఏం చెప్పారంటే..?

8 Mar, 2023 16:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో కూతురికి కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. ఆందోళనపడాల్సిన అవసరం లేదని, బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదామని పేర్కొన్నారు. పార్టీ అన్ని విధాలుగా ఉంటుందని హామీ ఇచ్చారు. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు అని కవితకు కేసీఆర్‌ సూచించారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు పంపించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 9న(గురువారం) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత.. ఈనెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ ఫిక్స్‌ అయిన కారణంగా విచారణకు హాజరుకాలేనని, ఈనెల 15న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీని కోరారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోడవంతో ఆమె ఢిల్లీ బయలుదేరారు. వాస్తవానికి కవిత గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే వెళ్తుండటంతో ఈడీ విచారణ కోసమే వెళ్తున్నారా? అనే చర్చ మొదలైంది.

కవితకు ఈడీ నోటీసులు పంపడాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. మహిళా దినోత్సవం రోజే సీఎం కేసీఆర్ కుమార్తెకు నోటీసులు పంపడం కేంద్రం దుర్మార్గపు చర్య అని మండిపడ్డాయి. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు తగిన బుద్ది చెబుతారని ధ్వజమెత్తాయి.

మరోవైపు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థిత వచ్చిందని కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కాం నిందితులు తనకు తెలుసునని కవితలో గతంలోనె చెప్పారని పేర్కొన్నారు.  ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇంత వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.

కాగా.. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాను కవితకు బినామీనంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పిళ్లై రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఆ మరునాడే ఆమెకు నోటీసులు పంపింది.
చదవండి: లిక్కర్‌ స్కామ్‌ హీట్‌: సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే..! పిళ్లై రిమాండ్‌ రిపోర్టులో సంచలనాలు

మరిన్ని వార్తలు