‘నోరెందుకు మెదపరు.. విమర్శలను తిప్పి కొట్టండి’

16 Feb, 2021 08:50 IST|Sakshi

ఒకటంటే వంద అనే సత్తా మనకుంది

బీజేపీ, కాంగ్రెస్‌ విమర్శలను తిప్పి కొట్టండి

పార్టీ శ్రేణులకు మంత్రి గంగుల, ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం

నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, దిగజారి మాట్లాడొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. ఎంతో అభివృద్ధి చేస్తున్నా విపక్షలు విమర్శిస్తూనే ఉన్నాయి.. అయినా మనమెందుకు నోరు మెదపడం లేదని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. ఇక నుంచి కాంగ్రెస్, బీజేపీ విమర్శలను తిప్పి కొడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నగరంలోని న్యాల్‌కల్‌రోడ్డులో గల ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి.. కాయా.. పీయా.. చల్‌గయా అన్న చందంగా పని చేశాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ వచ్చాక నిజామాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 

ఏకతాటిపైకి రావాలి.. 
రాముడున్న చోట రావణుడు ఉన్నట్లే.. కేసీఆర్‌ ఉన్న చోట కూడా రాక్షసులు ఉన్నారని ప్రతిపక్ష పార్టీల నేతలనుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు పాతవే అయినప్పటికీ.. అందులో నాయకులు కొత్తగా వచ్చి, ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు మనమంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు. రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ వచ్చాక జరిగిందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు అనేది పవిత్ర కార్యక్రమమని, కార్యకర్తలు బాధ్యత, గౌరవ ప్రదంగా తీసుకోవాలని సూచించారు. 

పార్టీ బాగుంటేనే పదవులు: కవిత 
పార్టీ బాగుంటే పదవులు వరిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు చెమట, రక్తం చిందించారని.. బాధలో ఉన్న కార్యకర్తలను నాయకులు ఎప్పుడూ మర్చి పోకూడదని సూచించారు. నాయకులకు మొదటి ఆప్తులు గులాబీ కండువా వేసుకున్న కార్యకర్తలేనని పేర్కొన్నారు. పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కార్యకర్తలే వారధులని కొనియాడారు. కార్యకర్తలపై ప్రేమతోనే సీఎం కేసీఆర్‌ సభ్యత్వ నమోదులో బీమా పథకం తెచ్చారని, పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ ఎదిగిన టీఆర్‌ఎస్‌ పార్టీకి త్యాగాల చరిత్ర ఉందన్నారు. గులాబీ కండువా ఒక బాధ్యతతో కూడుకున్నదన్న కవిత.. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కార్యకర్తలే వారధులని అన్నారు. 

దిగజారి మాట్లాడొద్దు.. 
ప్రతిపక్ష పార్టీలు ఒక్కటంటే వంద అనే సత్తా మనకుందని, ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ఎమ్మెల్సీ కవిత పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. ‘ఇతర పార్టీల వాళ్లు కొందరు కొత్తగా వచ్చారు.. వారిది నోరా.. మోరా.? నిర్మాణాత్మక విమర్శ చేయాలి తప్పితే స్థాయి దిగజారి మాట్లాడొద్దని’ వ్యాఖ్యానించారు. ‘టీఆర్‌ఎస్‌పై విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ కూడా అంతే బలంగా చేయాలి.. ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారనేది ఎక్కడికక్కడ ఆలోచించుకోవాలి.. ఎన్నో అభివృద్ధి పనులు చేశాము.. ఆ హక్కు కూడా ఉంది.. నిర్మాణాత్మక విమర్శ చేయాలి..’’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, ముజీబుద్దీన్, నాయకులు పాల్గొన్నారు. 
చదవండి: మేయర్‌ వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

మరిన్ని వార్తలు