గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలపై కవిత ట్వీట్‌.. రియాక్షన్‌ ఎలా ఉందంటే?

26 Jan, 2023 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. గత ఏడాది కూడా వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. కేసీఆర్, మంత్రులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు.

గురువారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’’ అంటూ ఆమె కామెంట్స్‌ చేశారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్‌ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్‌ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు’’ అంటూ కవిత ట్వీట్‌ చేశారు.
చదవండి: కొందరికి నేను నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్‌ డే వేడుకల్లో తమిళిసై షాకింగ్‌ కామెంట్స్

మరిన్ని వార్తలు