సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం

13 Oct, 2022 20:07 IST|Sakshi
ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే

స్ధానిక సంస్ధల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

అంధేరీ ఉప ఎన్నికలో పార్టీ పోటీచేయడం లేదు

కార్యకర్తలకు రాజ్‌ ఠాక్రే ఆదేశాలు

సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్‌శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్‌ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్‌ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. 

ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్‌
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్‌ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్‌పై తప్పుడు సందేశాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్‌ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. 

మైండ్‌ను సెట్‌ చేసుకోవాలి
పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్‌ను సెట్‌ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్‌ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. 

వాడివేడిగా రాజకీయ వాతావరణం
ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్‌ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్‌ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్‌ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్‌ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!)

మరిన్ని వార్తలు