దశదిశ లేని కూటమి

26 Jul, 2023 04:28 IST|Sakshi

దేశం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు  

దేశాన్ని విభజించడమే ­విపక్షాల లక్ష్యం   

నా మూడో టర్మ్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌  

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ 

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇలాంటి దశాదిశా లేని కూటమిని దేశంలో గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌లో కూడా ఇండియా అనే పేరుందని, దేశం పేరును వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించలేరని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు.

పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో విపక్షాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయని తప్పుపట్టారు. నిరాశలో మునిగిపోయిన విపక్ష ఎంపీలు దశాదిశా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. వారి ప్రవర్తనను బట్టి చూస్తే దీర్ఘకాలం విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వచ్చే సమయానికి మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని,  శాది ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ఉద్ఘాటించారు. తన మూడో టర్మ్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వమే రాబోతోందని పరోక్షంగా తేలి్చచెప్పారు. దేశ అభివృద్ధికి సహకరించాలని, చిత్తశుద్ధితో పని చేయాలని బీజేపీ నేతలకు మోదీ పిలుపునిచ్చారు.  

అవినీతిపరులంతా ఒక్కటయ్యారు  
ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమిగా ఏర్పడ్డాయని, నిషేధిత ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు సైతం దేశం పేరును వాడుకుంటున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అవినీతి పార్టీలు, అవినీతి నాయకులు కూటమి పేరిట ఒక్కటయ్యారని విమర్శించారు. దేశాన్ని పాలించి, విభజించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. అందుకే ఇండియా, ఇండియన్‌ అనే పేర్లతో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీల వారసత్వమే ఎన్డీయే అని చెప్పారు.

మరిన్ని వార్తలు