‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’

7 May, 2021 15:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ను అదుపు చేయడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. కరోనా కట్టడిపై చర్చించేందుకు అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించండి మోదీజీ అంటూ సోనియా విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర కాలంలో ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, వెంటిలేటర్‌ అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ (సీపీపీ) సమావేశం శుక్రవారం నిర్వహించగా ఆ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్‌ సభ్యులందరూ కలిసి పని చేయాలని సూచించారు. కొత్త రికార్డులు సృష్టిస్తూ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో పార్లమెంటరీ కమిటీ ఉమ్మడిగా కలిసి పని చేయాలని చెప్పారు. ఇది వ్యవస్థ పతనం కాదు మోదీ ప్రభుత్వ పరాజయం అని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, వెంటిలేటర్‌ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సెంట్రల్‌ విస్టాలాంటి అవనసర ఖర్చులకు మోదీ ప్రభుత్వం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. వ్యాక్సినేషన్‌ విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారని, దళితులు, బీసీలు, గిరిజనులకు వ్యాక్సిన్‌ వేయడం లేదని ఆరోపించారు. కరోనా కాలంలో యువజన కాంగ్రెస్‌ ఉత్సాహంగా పని చేస్తోందని సోనియా అభినందించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా కాంగ్రెస్‌ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు