మోదీ, కేసీఆర్‌లు బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులు

3 Oct, 2022 11:35 IST|Sakshi

కంటోన్మెంట్‌: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బ్రిటిష్‌ వారికి ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. మోదీ   దేశాన్ని ప్రమాదం వైపు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. బ్రిటిషర్లు విభిజించు, పాలించు విధానాన్ని అవలంబిస్తూ పాలిస్తున్న క్రమంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన గొప్ప వ్యక్తి మహాత్మాగాంధీ అని చెప్పారు. హైదరాబాద్‌ బోయినపల్లిలోని గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ ఆవరణలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, యాత్రను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హనుమంతరావు, వినోద్‌ రెడ్డి, సునీతారావు పాల్గొన్నారు.

గాంధీ ఆలోచనలకు భిన్నంగా టీఆర్‌ఎస్, బీజేపీ: భట్టి
ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లోపించాయని, గాంధీ ఆలోచనలకు భిన్నంగా టీఆర్‌ఎస్, బీజేపీలు పాలిస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసమానతలు లేని భారతదేశాన్ని గాంధీ కలలుగన్నారని... కానీ, బీజేపీ పాలనలో దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల్ని విస్మరించి ఇద్దరు వ్యాపారవేత్తలను మాత్రమే ప్రపంచ కుబేరులుగా ఎదిగేందుకు కేంద్రంలోని బీజేపీ దోహదపడిందని విమర్శించారు.

త్వరలో దళిత, గిరిజన బస్తీల్లో సీఎల్పీ బృందం పర్యటన
హైదరాబాద్‌ మురికివాడల్లోని దళిత, గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు సీఎల్పీ బృందం త్వరలోనే ఆయా బస్తీల్లో పర్యటిస్తుందని భట్టి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్‌ కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని ఖర్గేకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశా రు. సీఎం కేసీఆర్‌ సొంత విమానాన్ని కొనుగోలు చేయడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని, జాతీయ పార్టీ ఏర్పాటు ఇంకా ఊహాజనితంగానే ఉందని, పార్టీని ప్రకటించిన తర్వాతే దానిపై మాట్లాడతానని విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
చదవండి: వీఆర్‌ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు?

మరిన్ని వార్తలు