లిక్కర్‌ స్కాం దోషులను మోదీ వదిలిపెట్టరు

9 Mar, 2023 03:12 IST|Sakshi

 దొంగ దందాతో తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది... 

బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వికెట్‌ పడడంతో పాటు బీఆర్‌ఎస్‌ నేతల వికెట్లు క్లీన్‌ బౌల్డ్‌ కానున్నాయని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ క్రికెట్‌ పరిభాషలో వ్యాఖ్యానించారు. లిక్కర్‌ స్కాం దోషులెవరినీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మహిళామోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో సంజయ్‌ మాట్లాడారు.

కవితకు ఈడీ ఇచ్చిన నోటీస్‌లకు తెలంగాణ సమాజానికి, బీజేపీకి ఏమి సంబంధమని ప్రశ్నించారు. ఓ పక్క లిక్కర్‌ దందాలో ఇరుక్కుని తెలంగాణ తలవంచదని కవిత చెబుతున్నారని, కేసీఆర్‌ బిడ్డ చేసిన దొంగ దందా వల్ల తెలంగాణ మహిళలు నేడు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. లిక్కర్‌ స్కాం, కవితకు నోటీసులపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

సెంటిమెంట్‌ను రెచ్చగొడితే పట్టించుకునే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. మహిళలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయిందనీ ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల ముసలి మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు పాతబస్తీ అడ్డా 
‘కేసీఆర్‌ పొరపాటున మళ్లీ సీఎం అయితే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లకు ప్రోత్సాహకాలు ఇస్తారేమో.. పాతబస్తీలో 30 వేల దొంగ బర్త్‌ సర్టిఫికెట్లు, డెత్‌ సర్టిఫికెట్లు సృష్టించారు.. పాతబస్తీ ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు అడ్డా అయ్యింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వాళ్లు యథేచ్ఛగా వస్తున్నారు. అందుకే నేను సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తానంటే చాలా మంది విమర్శించారు. ఇప్పుడేమంటారు? ’అని సంజయ్‌ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో మహిళలకు సముచిత స్థాయిలో టికెట్లు ఇచ్చే పార్టీ బీజేపీనేనని, గెలిచే మహిళా నేతలకు తప్పకుండా టికెట్లు ఇస్తామని ఆయన హామీనిచ్చారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కార్యదర్శి జయశ్రీ, జాతీయ మహిళా మోర్చా నాయకులు నళిని, కరుణాగోపాల్, తుల ఉమ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు 

కవిత చేసిన దొంగ దందా ఎవరి కోసం? 
‘కవిత చేసిన దొంగ దందా, పత్తాల దందా తెలంగాణ సమాజం కోసమా? ఎవరి కోసం? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్‌ కొత్తకొత్త డ్రామాలు ఆడుతున్నారు. కవిత చేసిన దుర్మార్గపు చర్యలను ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితి. దొంగే.. దొంగ అన్నట్లు కవిత వ్యవహారం ఉంది ’అని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు