దేవభూమిలో ముస్లిం వర్సిటీకి కాంగ్రెస్‌ సన్నాహాలు

13 Feb, 2022 12:19 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్‌ రెండో దశ ఎన్నికల ప్రచారానికి శనివారం తెరపడింది.  ఉత్తరాఖండ్‌లో 70, గోవాలో 40, యూపీలో 55 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. ప్రచారానికి చివరి రోజైన శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలి ప్రచారం చేశారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను తరిమికొట్టే అవకాశం ప్రజలకు వచ్చిందని అన్నారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు కాంగ్రెస్‌ను తిరస్కరించాయని, ఇక్కడ ప్రజలు కూడా అదే పని చేయాలని పిలుపునిచ్చారు.

మైనారిటీలను బుజ్జగింపే ఎజెండాగా కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దేవతలు నడయాడే భూమిని ఇలాంటి పనులతో అవమానిస్తే మీరు సహిస్తారా? అని ప్రశ్నించారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల కాంగ్రెస్‌ అవగాహన లేదన్నారు. సైనికుల్ని కూడా అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకే చెల్లిందని మోదీ ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌కే గర్వకారణంగా నిలిచిన దేశ మొదటి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ను వీధి రౌడీ అంటూ కాంగ్రెస్‌ మాట్లాడిందని ఈ ఎన్నికల్లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు