ఆలయాలు కూల్చే సంస్కృతి చంద్రబాబుదే

10 Jan, 2021 05:00 IST|Sakshi
సర్వమత ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడుతున్న ఎంపీ మోపిదేవి

వైఎస్‌ జగన్‌కు నిలబెట్టడమే తెలుసు 

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి  

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగిసి రెండేళ్లు అయిన సందర్భంగా సర్వమత ప్రార్థనలు 

సాక్షి, అమరావతి:  చంద్రబాబుది దేన్నైనా కూల్చే సంస్కృతి అయితే సీఎం జగన్‌ది ప్రజల అభీష్టం మేరకు తిరిగి నిలబెట్టే సంస్కృతి అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. వెన్నుపోట్లు, గుడుల కూల్చివేతల సంస్కృతి ముమ్మాటికీ బాబుదే అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు పట్టింపులు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎంకు కుల, మత రాజకీయాలు అంటగట్టడం దారుణం అని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే 90 శాతానికి పైగా నెరవేర్చారని చెప్పారు. 3,648 కిలోమీటర్ల వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలనే మార్చివేసిం దన్నారు. అంతకు ముందు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌తో కలసి పాదయాత్ర చేసిన పలువురు పార్టీ నేతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

నిమ్మగడ్డది మొదటి నుంచీ ఏకపక్ష ధోరణే 
► ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ది మొదటి నుంచి ఏకపక్ష ధోరణే అని మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుపట్టారు.   

మరిన్ని వార్తలు