దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్

4 Apr, 2021 04:28 IST|Sakshi

చంద్రబాబుపై ఎంపీ మోపిదేవి ధ్వజం 

రేపల్లె: గ్రామాల అభివృద్ధికి ఎంతో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్ష నాయకుని హోదాలో బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం పరిషత్‌ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మోపిదేవి మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని, కరోనా విపత్తును బూచిగా చూపి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరగకుండా అడ్డుకున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఆయనకు మతి భ్రమించిందన్నారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఎన్నికలు  నిర్వహిస్తుంటే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజల ఛీత్కారాలు తప్పవని గ్రహించి కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడి కుట్ర రాజకీయాలను గమనించి ఏమాత్రం అజాగ్రత్తగా లేకుండా గ్రామాల్లోని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల అభ్యర్థుల విజయాన్ని కానుకగా అందించాలన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు