అధికారంలో ఉంటే బీసీలకు వెన్నుపోటు

29 Sep, 2020 05:08 IST|Sakshi

బీసీలతో చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం 

ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు 

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు బీసీలను వెన్నుపోటు పొడవడం, వారి వెన్నెముక విరిచేయడం.. అధికారం పోయాక బీసీలే మాకు వెన్నెముక అని మాట్లాడటం టీడీపీ అధినేత చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ధ్వజమెత్తారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని ఒక ప్రముఖ పత్రికలో కథనం రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 

► అధికారంలో లేనప్పుడు జెండాలు మోయడానికి, జిందాబాద్‌ కొట్టడానికి చంద్రబాబుకు కనిపించేది బీసీలే. తమది బీసీల పార్టీ అని జపం చేయడం తప్పితే వారికి చంద్రబాబు చేసింది శూన్యం. 
► బీసీలకు భరోసా కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సుమారు 57 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 741 మందికి పదవులు ఇస్తున్నారు.  
► నాలుగు రాజ్యసభ పదవుల్లో రెండింటిని, ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్లో ఒకటి బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడైనా కార్యకర్త స్థాయి వారికి రాజ్యసభ పదవి ఇచ్చారా?  
► చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి?  వైఎస్‌ జగన్‌ పాలనలో ఎన్ని లక్షల కుటుంబాలు బాగు పడ్డాయో చర్చకు మేం సిద్ధం. 

మరిన్ని వార్తలు