టీఆర్‌ఎస్‌ దూకుడు.. 27న ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్‌

17 Oct, 2021 02:45 IST|Sakshi

వరుస సమావేశాలు, కార్యక్రమాలతో బిజీబిజీ

నేడు లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం

రేపు తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌లోకి మోత్కుపల్లి

27న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్‌

ముల్కనూరు లేదా హుస్నాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచార సభ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు సంస్థాగత కార్యక్రమాలకు సిద్ధమవుతూనే మరోవైపు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను అధినేత కేసీఆర్‌ ప్రస్తావించే అవకాశముంది. 

రేపు టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి మోత్కుపల్లి
సుమారు మూడు నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఈ నెల 5న దళితబంధు పథకంపై చర్చ సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన మోత్కుపల్లి... సీఎం కేసీఆర్‌ను కలసి పార్టీలో చేరిక ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. మోత్కుపల్లి అనుచరులతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

27న ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్‌... 
హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ఈ నెల 30న జరగనుండగా ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ప్రచార సభ ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు వచ్చే నెల 15న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ‘తెలంగాణ విజయ గర్జన’ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న హుస్నాబాద్‌ లేదా ముల్కనూరులో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభ ద్వారానే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అంశాలను ప్రస్తావించే అవకాశముందని సమాచారం. 

ప్లీనరీ, విజయగర్జనకు సన్నాహాలు షురూ... 
హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ ప్రారంభించింది. ఆహ్వానితులకు మాత్రమే ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో సుమారు 14 వేల మంది ప్రతినిధుల పేరిట ఆహ్వాన లేఖలను పార్టీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం చేస్తోంది.

మరోవైపు వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు అనువైన చోటు కోసం పార్టీ నేతలు అన్వేషణ ప్రారంభించారు. వరంగల్‌ నగరానికి సమీపంలోని మామునూరును మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది. సభా వేదిక నిర్మాణం, సభాస్థలి, పార్కింగ్‌ తదితరాలకు అనువైన ప్రదేశాన్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. 

మరిన్ని వార్తలు