ముహూర్తమే తరువాయి! 

25 Jul, 2021 01:25 IST|Sakshi

 ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్‌తో మోత్కుపల్లి భేటీ? 

సాక్షి, హైదరాబాద్‌: కారు సిద్ధంగా ఉంది.. కారెక్కడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నారు.. ఇక ముహూర్తమే తరువాయి.. బీజేపీకి రెండురోజుల క్రితం రాజీనామా చేసిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ‘దళితబంధు’పై ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరిక అంశం ప్రస్తావనకు రాగా, బీజేపీలో తనకు గౌరవం లేదనే అభిప్రాయంతో ఉన్న మోత్కుపల్లి కారెక్కడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

రాజకీయంగా గతంలో విమర్శలు చేసుకున్నా, వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, టీఆర్‌ఎస్‌లో సరైన గౌరవం, గుర్తింపు ఉంటుందని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. మోత్కుపల్లి ఒకట్రెండు రోజుల్లో మరోమారు కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశముంది. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిక ముహూర్తం ఖరారయ్యే అవకాశముంది. రాజ్యసభలో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అందరూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావుతోపాటు డి.శ్రీనివాస్‌ రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది జూన్‌ లో ముగియనుంది. ఈ స్థానాల్లో ఒకదానిని ఎస్సీలకు కేటాయించాలనే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. మోత్కుపల్లిని వచ్చే ఏడాది రాజ్యసభకు పంపే అవకాశముం దని తెలుస్తోంది.  

పెద్దిరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌ కూడా..
మోత్కుపల్లి మాదిరిగానే మాజీమంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లు బీజీపీని వీడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

మరిన్ని వార్తలు