ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. అయినా దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు

24 Jul, 2021 09:10 IST|Sakshi

బీజేపీకీ మోత్కుపల్లి రాజీనామా

టీఆర్‌ఎస్‌లో చేరికకు సన్నాహం

మెజార్టీ అనుచరులు ‘కారు’లోనే..

ఆరుసార్లు ఎమ్మెల్యేగా నర్సింహులు రికార్డు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు

సాక్షి, యాదాద్రి: సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా వేసుకున్న వెత్కుపల్లి.. సంవత్సరంన్నర కాలంలోనే బయటకు వచ్చారు. ఆ పార్టీ విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు పంపించారు. అయితే, నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల దళిత ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం పలికారని, ఆ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. త్వరలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు.

కేసీఆర్‌ మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకొని ఎస్సీ సాధికారిత కార్యక్రమంలో భాగస్వామిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మోత్కుపల్లి, కేసీఆర్‌ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాలంలో మంచి మిత్రులు కావడం గమనార్హం. రాజకీయ విభేదాలతో ఇంతకాలం దూరంగా ఉన్నారు. అంతేకాదు.. పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. కలిసి పనిచేసే సమయం వచ్చిందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని మోత్కుపల్లి అనుచరులు చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు ఇప్పటికే మెజార్టీగా టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. కొందరు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్న సంకేతాలతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు
మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ నేత. టీడీపీ, బీజేపీ పొత్తులో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌గా అవకాశం కోసం ఎదురు చూశారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో తనకు గవర్నర్‌ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, చంద్రబాబునాయుడు వల్లే తనకు గవర్నర్‌ పదవి రాలేదని అలాగే.. ఇస్తామన్న రాజ్యసభ పదవి కూడా ఇవ్వకుండా డబ్బున్న వాళ్లకు అమ్ముకున్నాడని మోత్కుపల్లి చంద్రబాబు పై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనకు ఏ పదవీ దక్కకుండాపోయింది. తాజా బీజేపీలో చేరిన ఆయనకు జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. అలాగే గవర్నర్‌ పదవుల్లో కూడా అవకాశం ఉందన్న నమ్మకం ఆయన అనుచరుల్లో వ్యక్తమైంది. అవేవీ రాకపోవడంతో మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారు. సీనియర్‌ నేతనైన తన సేవలను పార్టీ సరిగా  వినియోగించుకోవడం లేదన్న కారణంతో రాజీనామా చేశారు. 

ఆరుసార్లు ఎమ్మెల్యేగా..
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి ఆయన రికార్డు విజయాలను నమోదు చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్‌ స్థాపింన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో టీడీపీ నుం, 1989 ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుం గెలుపొందారు. 1999లో కాంగ్రెస్‌ నుంచి ఆలేరులో గెలుపొందిన ఆయన 2004లో టీడీపీ తరపున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు.

2008లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయ్యారు. ఆ తర్వాత 2009లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అంతేకాకుండా నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి బహిష్కరణ అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమిని చవిచూశారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గనులు, విద్యుత్‌ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు