మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి

18 Sep, 2021 15:38 IST|Sakshi
బాబుల్‌ సుప్రియోను ఆహ్వానిస్తున్న డెరెక్‌ ఒబ్రెయిన్‌, అభిషేక్‌ బెనర్జీ,

గతంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటన

మాట మార్చేసి టీఎంసీలో చేరిన గాయకుడు

స్వాగతించిన అభిషేక్‌ బెనర్జీ, డెరెక్‌ ఒబ్రెయిన్‌

కలకత్తా: ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో బీజేపీకి బైబై చెప్పేసి ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులు కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా శనివారం టీఎంసీ గూటికి చేరారు. బాబుల్‌ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్‌ బబ్రెయిన్‌ సాదర స్వాగతం పలికారు.
చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు:హోంమంత్రి

మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జూలై 31వ తేదీన ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్‌ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్‌ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు.
చదవండి: పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?

అయితే ఇటీవల కేంద్రమంత్రివర్గంలోకి తనను తీసుకోకపోవడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. వాటితోపాటు మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్‌ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా తృణమూల్‌లో చేరడంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తారనే వార్తలకు తెర పడింది.
 

మరిన్ని వార్తలు