ఇలా ఐతే.. వైద్యం ఎలా ?

15 May, 2021 10:49 IST|Sakshi

ఎంజీఎం వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాలు లేవు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఎంజీఎం/వరంగల్‌ : ఎన్నో ఆశలతో తమ ప్రాణాలు నిలుస్తాయనే భావనతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నిరాశే మిగులుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నా వారికి పీపీఈ కిట్లు, మాస్క్‌లతో పాటు బాధితులకు రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లు సమకూర్చలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తద్వారా బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఎంజీఎంలోని కరోనా వార్డును బండి సంజయ్‌ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్‌ ధరించిన ఆయన వైద్యులతో కలిసి వార్డులో బాధితులతో మాట్లాడారు. చికిత్స, పౌష్టికాహారంపై ఆరా తీశాక సంజయ్‌ ఆస్పత్రి బయట విలేకరులతో మాట్లాడారు.

బాధ కలుగుతోంది.. 
ఎంజీఎం ఆస్పత్రిని చూస్తే బాధ కలుగుతోందని.. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన కోవిడ్‌ వార్డులు సాధారణ వార్డులకంటే అధ్వాన్నంగా మారాయని సంజయ్‌ పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై భారం పడుతోందన్నారు. ఇప్పటికే డాక్టర్‌ శోభారాణి, నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లకు సరైన వైద్యం అందక మృతి చెందారంటే మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా వైద్యులు, సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించి ఇన్సెంటివ్‌ చెల్లించాలని డిమాండ్‌ చే శారు. కాగా, పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి వంద వెంటిలేటర్లు వచ్చినా వాటిని ఎందుకు వినియోగించడం లేదో చెప్పాలన్నారు. సంజయ్‌ వెంట ఎంజీఎం సూ పరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి, ఆర్‌ఎంఓ వెంకటరమణ, వైద్యులు, బీజేపీ నాయకులు ఉన్నారు. 

చదవండి: కేసీఆర్‌ కళ్లుమూసుకుని పరిపాలిస్తున్నారు: వైఎస్‌ షర్మిల 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు