ఆ నియోజకవర్గంలో ‘గులాబీ’ల మధ్య యుద్ధం!

30 Oct, 2022 15:20 IST|Sakshi

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గులాబీల మధ్య యుద్ధం మొదలైంది. సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య వార్ తీవ్రమయింది. మాజీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే మీద యుద్ధం ప్రకటించారు. దీనికి ఎమ్మెల్యే వర్గం కూడా సై అంటోంది. రెండు వర్గాలు సమరశంఖం పూర్తించి ఆధిపత్యపోరుకు తెర తీసాయి. 

సంక్షేమంపై దళారి డేగలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల నియోజకవర్గం బోథ్‌లో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై మాజీ ఎంపి నగేష్ తిరుగుబాటు జెండా ఎగురేశారు. కొద్ది రోజుల క్రితం నగేష్ జన్మదిన వేడుకలు బోథ్ లో  నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై నగేష్ తీవ్ర విమర్శలు   చేశారు. నియోజకవర్గంలో రాష్ట్ర సర్కారు పథకాలు లభించాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందని నగేష్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల విషయంలో దళారులే రాజ్యమేలుతున్నారని.. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకంలో అవినీతి జరిగిందన్నారు. బోగస్ పేర్లతో ప్రభుత్వ సొమ్మును లూటీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ నగేష్. 

రియల్ ఎస్టేట్ పాలిటిక్స్‌
తన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యాపారాలు చేయలేదని.. తనతో ఉన్న నాయకులు కూడా వ్యాపారాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎద్దేవా చేస్తూ ఈ వ్యాఖ్యలు చెయడం సంచలనం కలిగించింది. బోథ్ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చానని నగేష్‌ చెప్పారు. ఇప్పుడు బోథ్ ప్రతిష్ట మసక బారుతుందని అందోళన వ్యక్తం చేశారు. ‌రాబోయే ఎన్నికలలో బోథ్ లో  టిఅర్ఎస్ జెండా ఎగురవేయడమే  తనలక్ష్యమంటూ..తానే ఎమ్మెల్యే అభ్యర్థినని కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు నగేష్.

ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు?
మాజీ ఎంపి నగేష్ చేసిన వ్యాఖ్యలు బోథ్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎన్నికల ప్రచారంలో  ఉండటంతో ఆయన వర్గీయులంతా ఇచ్చోడలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాబలం ఉన్న రాథోడ్‌కే కేసీఆర్ మళ్ళీ అవకాశం ఇస్తారని, ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని ప్రకటించారు. కొందరు కావాలనే రాథోడ్‌కు టిక్కెట్ రాదని.. ఒకవేళ వచ్చినా తాము పనిచేయంటూ ప్రకటించడంపై అగ్రహం వ్యక్తం చేశారు. రాథోడ్ బాపురావు పై  అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరికలు జారీచేశారు. మొత్తం మీద అధికార పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోరు కారణంగా బోథ్ నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మరిన్ని వార్తలు