సాగదీయొద్దు.. సాగనంపుదాం!

24 Aug, 2022 01:04 IST|Sakshi

వెంకట్‌రెడ్డి తీరుపై గుర్రుగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం 

ఆయనతో చర్చలు ఎందుకంటూ ప్రియాంక ముందే అసహనం

సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య వైరాన్ని మరింత పెంచుతున్నట్లే కనబడుతోంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది మొదలు మొన్నటి హోంగార్డు వ్యాఖ్యల వరకు అన్నింటినీ సమర్ధిస్తూ వస్తున్నారంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపేందుకు మాణిక్యం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఢిల్లీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వద్ద సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీలోనూ వెంకట్‌రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపే విషయమై మాణిక్యం కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారని కాంగ్రెస్‌లోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. భేటీ సందర్భంగా ప్రియాంకతో ప్రత్యేకంగా మాట్లాడిన మాణిక్యం ‘వెంకట్‌రెడ్డికి పీసీసీ రాలేదన్న అక్కసును తొలి నుంచి వెళ్లగక్కుతున్నారు. నాపైనా విమర్శలు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వైఖరితో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. పీసీసీ అధ్యక్షుడు నిర్వహిస్తున్న భేటీలకు ఆయన హాజరుకావడం లేదు. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకే నష్టం. ఆయన పార్టీని వీడాలనుకుంటే వీడనిద్దాం’అని అన్నట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వెంకట్‌రెడ్డి పార్టీలో ఉన్నా ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలిచే సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలుపునకే కృషి చేస్తారని, అది జరుగకుండా ఉండాలంటే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపడమే మేలనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొంటున్నాయి. 

ప్రియాంక జోక్యంతో నేడు చర్చలు
ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అంశంపై చర్చ జరిగినా ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. సస్పెండ్‌ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్‌రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌లను వెంకట్‌రెడ్డితో చర్చించేందుకు పంపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

ఈ ఇద్దరు నేతలు బుధవారం ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి. చర్చలు ఎందుకంటూ ప్రియాంక ముందే మాణిక్యం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే సమయంలో సీనియర్‌ నేతలతో సఖ్యత విషయంలో వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొనిపోవాలని రేవంత్‌కు ప్రియాంక చెప్పినట్లు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు వద్దని, సొంతపార్టీ నేతలపై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తంగా ఉండాలని సూచించారని తెలిసింది.   

మరిన్ని వార్తలు