ఆ ప్రాంతాల్లో రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే: ఎంపీ కోమటిరెడ్డి

28 Aug, 2022 16:00 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లా ప్రజలకి, రైతాంగానికి నష్టం కలిగించే చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం​ వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీకి కేటాయించబడిన నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం నల్లగొండ జిల్లా ప్రజలకు,రైతాంగానికి తీవ్ర నష్టం కలుగజేస్తుందన్నారు.

1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు కేటాయింపులు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా నల్లగొండ జిల్లా రైతాంగానికి  అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన  45 టీఎంసీల నీటిని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందన్నారు. 

'నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే. ఫ్లోరైడ్ రూపుమాపింది మేమే. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్‌ ల కెనాల్స్ బాగున్నాయి.

మాదగ్గర కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిన్నది బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధం. జీవో రద్దు చేయాలనీ సీఎంకి లేఖ రాస్తా. అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తా. ఎస్ఎల్బీసీ 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 20టీఎంసీలు కేటాయించాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

చదవండి: (Congress Party: కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌)

మరిన్ని వార్తలు