ట్రాక్టర్‌నే కాదు, పార్టీని కూడా కొల్లేరులోకే!!

7 Nov, 2020 15:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దళితులంతా ఏకంగా ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేశ్‌ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దళితులకు మేలు జరుగుతోందని చంద్రబాబు అక్కసుతో ఉన్నారని అన్నారు. సీఎం జగన్‌ను ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను కించ పరిచే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌కు అండగా ఉన్నారని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ సురేశ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.

దళితుల ముసుగులో చేసే ఉద్యమంలో జై భీమ్ బదులు జై చంద్రబాబు అంటే బాగుంటుందని నందిగం సురేశ్‌ ఎద్దేవా చేశారు. దళిత మేధావి అంటూ ఒకరు చంద్రబాబు యూజర్‌గా మారారని విమర్శించారు. దళితులకు అన్యాయం జరుగుతోందని చెప్తున్న ఆ మేధావి రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని కొత్త గళం వినిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో హిట్లర్  నియంత పాలన సాగిందని గుర్తు చేశారు. బాబు హయంలో జరిగిన అన్యాయంపై ఆనాడే ప్రశ్నించి ఉండాలని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఈ మేధావులు పుట్టుకొస్తున్నారని చురకలంటించారు.

అప్పుడేమయ్యారు!
చంద్రబాబు దళిత పిల్లల ఫీజులు ఎగ్గొట్టినప్పుడు ఈ మేధావి ఏమయ్యాడని ఎంపీ నందిగం సురేశ్‌ సూటిగా ప్రశ్నించారు. బాబు డైరెక్షన్‌లో కాకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని హితవు పలికారు. పేదలకు ఇళ్లు, ఇంగ్లీషు విద్యకు అడ్డుపడవద్దని చంద్రబాబుకు ఈ మేధావి చెప్పాలని అన్నారు. 2024 లో అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదని ఎంపీ సురేశ్‌ జోస్యం చెప్పారు. ఆ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్‌ కొల్లేరులో ట్రాక్టర్ నెట్టాడని, పార్టీని కూడా నెట్టుతాడని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు