'జైలులో నన్ను టార్చర్ పెట్టారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి..'

6 Apr, 2023 19:47 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా తనను గతేడాది జైల్లో టార్చర్ పెట్టారని ఆరోపించారు. ఎంత హింసించినా తన నమ్మకాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. ఆ రోజులు తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. అసలు ఎందుకు జైలుకు వెళ్లావు? ఏం చేశావు? అని తన పిల్లలు తరచూ అడిగేవారని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది హనుమాన్ జయంతి సందర్భంగా అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హునుమాన్ చాలీసా చదువుతానని శపథం చేశారు నవనీత్ రానా. తనతో పాటు వేలాది మంది కలిసిరావాలని పిలుపునిచ్చారు. దీంతో శివసేన కార్యకర్తలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.  ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో  ముందుజాగ్రత్తగా చర్యగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 

తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నవనీత్‌ రానా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి సీఎం థాక్రేకు తగిన శాస్తి జరిగిందని, పదవి పోయిందని విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడు కూడా పార్టీని కాపాడలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తప్పుడు నిర్ణయమని తండ్రి ఆవేదన

మరిన్ని వార్తలు