ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్లు నష్టపరిహారం ఇవ్వాలి: ఎంపీ రేవంత్‌రెడ్డి 

24 Aug, 2020 03:58 IST|Sakshi

చాదర్‌ఘాట్‌ (హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌జీ పాలిమార్స్‌ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం రూ. కోటి నష్టపరిహారం ప్రకటించిన తీరుగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీశైలం ప్రమాద బాధితులకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌ ఆజంపురలోని ఏఈ ఫాతిమా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావులపై కేసు నమోదు చేయాలన్నారు. ఇంతవరకు మంత్రి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు ఫాతిమా మెరిట్‌ విద్యార్థి అని, ఆమె కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇక్కడ

ఎంపీ రేవంత్‌ వెంట మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఉన్నారు.
గవర్నర్‌కు లేఖ..: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉందని, ఈ ఘటనకు కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకునేలా సీఎం కేసీఆర్‌ను ఆదేశించాలని కోరారు. ప్రమాదం జరిగే అవకాశాలపై అక్కడి సిబ్బంది రెండ్రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆ లేఖలో ఆరోపించారు.  

>
మరిన్ని వార్తలు