సభలో ప్రధాని మాట చట్టంగానే భావిస్తాం

6 Feb, 2021 05:07 IST|Sakshi

పీఎం మాట నిలబెట్టుకోకపోతే సీఎం తప్పా 

పార్లమెంటుకి టీడీపీ అవాస్తవాలు చెబుతోంది 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌

సాక్షి, న్యూఢిల్లీ: సభ సాక్షిగా ప్రధాని మాట్లాడిన మాటలు చట్టంగానే భావిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అన్నారు. 2014లో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలుచేయాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు నిందలు మోపుతున్నారని, ప్రధాని మాట నిలబెట్టుకోకపోతే ముఖ్యమంత్రి తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో బోస్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

‘కరోనా కారణంగా దేశంలో నష్టపోని కుటుంబం అంటూ ఏదీలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో వారికి ఊరటనిచ్చే అంశాలేవీ లేవు. అసంఘటిత, వ్యవసాయ కార్మికులకు సహాయంపై మాట్లాడకపోవడం దురదృష్టకరం. సుమారు 50 కోట్ల మంది దీనావస్థలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు శక్తిమేర ఆదుకున్నాయి. రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. దేశమంటే మట్టి కాదోయ్‌.. అనే గురజాడ మాటలను ఇటీవల ప్రధాని మోదీ కూడా పలికారు. బాధ్యతగా రాష్ట్రపతితో ఒక్క మాట కూడా చెప్పించలేదు. ప్రజల ఆర్థిక కష్టాలు తీర్చడానికి అమ్ములపొదిలో రెండు ప్రధాన అస్త్రాలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్‌ చెప్పారు. అవేమిటో రాష్ట్రపతితో చెప్పించి ఉంటే బాగుండేది.

 

‘హోదా’పై కేంద్రం ఆలోచించాలి 
ఇక ఏపీ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక హోదా. ఏపీకి ‘హోదా’ ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. ఆ హామీని ఈ ప్రభుత్వం అమలుచేయడంలేదు. ప్రధాని సభలో మాట్లాడే మాట జీఓ, చట్టంగానే భావిస్తాం తప్ప తర్వాత ప్రధాని వచ్చి దాన్ని పక్కన పెడతారని అనుకోలేం. దీనిపై కేంద్రం ఆలోచన చేయాలని కోరుతున్నా.  ఏప్రిల్, 2022 కల్లా పోలవరం పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. సవరించిన అంచనాలను త్వరగా అనుమతిస్తూ ప్రకటన చేయాలి. టీడీపీ నేతలు పార్లమెంటులో అవాస్తవాలు చెప్పడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. వారి హయాంలో 800 పైగా ఆలయాల్లో దాడులు జరిగితే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. ఆధారాల్లేకుండా పవిత్రమైన సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకురావల్సి ఉంది. మరింత సమయం ఇవ్వండి,  మరోసారి ఆయా అంశాలపై మాట్లాడతాం’.. అని బోస్‌ ప్రసంగాన్ని ముగించారు. 

మరిన్ని వార్తలు