విగ్రహాల విధ్వంసం చంద్రబాబు కుట్రే..

7 Jan, 2021 03:46 IST|Sakshi

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి 

ఎన్నికల్లో ఓడిపోయి మతం పేరుతో బాబు దుష్ప్రచారం 

ఏపీ పోలీసులు సమర్థంగా వ్యవహరిస్తున్నారు

తిరుమలలో పూజలు చేయటాన్ని సీఎం జగన్‌ ప్రచారం కోసం వాడుకోలేదు

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే అక్కసుతో కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. ప్రముఖ జాతీయ చానల్‌ ‘న్యూస్‌ ఎక్స్‌’ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తెరవెనుక  ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పారు. ఏపీలో పరిణామాలపై సుబ్రహ్మణ్యస్వామి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.... 

తిరుమలలో వైఎస్‌ జగన్‌ పూజలు చేశారు.. 
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల ఘటనలపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అని విమర్శిస్తున్నారు. ఆయన క్రిస్టియన్‌ ఎలా అవుతారు? వైఎస్‌ జగన్‌ తిరుమలలో తెల్లవారుజామున 2 గంటలకు పూజలు చేశారు. కానీ ఆయన దాన్ని తన ప్రచారం కోసం వాడుకోలేదు. టీటీడీ ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)తో ఆడిట్‌ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి దేశంలో వైఎస్‌ జగన్‌ ఒక్కరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదంతా చంద్రబాబు కుట్ర. సోనియాగాంధీ(కాంగ్రెస్‌)తో కలసి పోటీచేస్తే ప్రజలు ఎవరూ ఆయన వైపు చూడలేదు. అందుకే ఆయన హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారు.  

టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలంటూ దు్రష్పచారం 
టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. దీనిపై నేను విచారించా. టీటీడీలో కేవలం ఏడుగురే అన్య మతస్తులు ఉన్నారు. వారు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన వారు కాదు. అంతకు ముందు ప్రభుత్వంలో నియమితులైనవారే. వారిని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోకి బదిలీ చేసింది. ఇక ముందు టీటీడీలో హిందూయేతరులను నియమించరాదని విధాన నిర్ణయం కూడా తీసుకున్నారు. టీటీడీ చైర్మన్‌గా వైఎస్‌ జగన్‌ తన బంధువు వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తే ఆయన క్రిస్టియన్‌ అని, ఆయన భార్య క్రిస్టియన్‌ మిషనరీ అని దుష్ప్రచారం చేశారు. వారిద్దరూ నరేంద్ర మోదీ కంటే కూడా పక్కా హిందువులు. అలాంటి వారిపై దుష్ప్రచారం చేశారు.   


పోలీసులనే అడగండి.. 
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో పోలీసులను అడగండి. ఆలయాలపై దాడులు చేసినవారిపై  కేసులు నమోదు చేశారో లేదో చెబుతారు. అంతేగానీ బీజేపీ నేతలనో, కార్యకర్తలనో అడగవద్దు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం అన్ని దేవాలయాలను స్వాధీనం చేసుకుని ముఖ్యమంత్రినే అన్ని ఆలయాలకు చైర్మన్‌గా ప్రకటించడంపై కోర్టులో కేసు వేశా. ఆస్తులపై అధికారమంతా ఆలయాలదేనని న్యాయస్థానం పేర్కొంది. కేసు ఇంకా విచారణలో ఉంది. 

మరిన్ని వార్తలు