దేశప్రగతికి టీఆర్‌ఎస్‌ బ్రేకులు

8 Sep, 2021 05:24 IST|Sakshi
సంగారెడ్డిలో సభలో మాట్లాడుతున్న  ఎంపీ తేజస్వీ సూర్య. చిత్రంలో బండి సంజయ్, రఘునందన్‌రావు  తదితరులు 

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య విమర్శ

జనాభా నియంత్రణ చట్టం తెస్తాం: బండి సంజయ్‌

ఎంఐఎంకు లబ్ధి చేకూర్చే ఆ బిల్లును అడ్డుకుంటామని వెల్లడి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తుంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు మాత్రం అభివృద్ధికి బ్రేకులు వేస్తోందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం సంగారెడ్డిలోని అంబేడ్కర్‌చౌక్‌ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరప్రదేశ్‌ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పారు. ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఇద్దరుకంటే ఎక్కువ సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని టీఆర్‌ఎస్‌ సర్కారు చూస్తోందని, ఆ బిల్లును అడ్డుకుంటామని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్రానికి పంపిన కేసీఆర్‌ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.

ఈ సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈ బహిరంగసభ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అతడిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.  

మరిన్ని వార్తలు